మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్ట్ అని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ విమర్శించారు. అయ్యన్నపాత్రుడి చరిత్ర అందిరికీ తెలుసన్నారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చారని ఆరోపించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈరోజు (శనివారం) విశాఖలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం అయ్యన్నపాత్రుడికి పట్టుకుందన్నారు. అందుకోసమే పార్టీ నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
వెయ్యి మంది చంద్రబాబు, లక్ష మంది అయ్యన్నపాత్రులు వచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల్లో బరిలోకి దిగే ధైర్యం ఉందా అని ఉమా శంకర్ గణేశ్ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల్లో బ్రోకర్లు ఉంటారని పేర్కొన్నారు. తమ పాలనలో వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాకు సీఎం జగన్ 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారని ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ తెలిపారు. 470 కోట్లతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారని వివరించారు.
చంద్రబాబు, లోకేశ్ సైకోలు అని విరుచుకుపడ్డారు. తాము తలచుకుంటే చంద్రబాబును బూతులు తిట్టలేమా? అని అడిగారు. ఇప్పటికైనా అయ్యన్నపాత్రుడు తన తీరు మార్చుకోవాలని సూచించారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీ మారుతారని ప్రచారం జరిగినా టీడీపీలోనే ఉండాలని డిసైడయ్యారు. గంటా శ్రీనివాస్‌పై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇటు సీఎం జగన్, మంత్రులను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ప్రతీగా వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ స్పందించారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నుంచి అయ్యన్నపాత్రుడిని పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఓడించారు. ఈయనకు అయ్యన్న రాజకీయ గురువట.. గురువును ఓడించిన శిష్యుడు అని అప్పట్లో నియోజకవర్గంలో అంతా అన్నారు.