పవన్ పై విమర్శలు చేసిన ప్రతిసారీ.. ఆయన మూడు పెళ్లిళ్ల టాపిక్ రావాల్సిందే. ప్రతిసారి పవన్ ని తన మూడు పెళ్లిళ్ల విషయంతో విమర్శలు చేస్తుండటంతో… ఇటీవల పవన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. అయితే ఆయన చేసిన కామెంట్స్ ని మాత్రం మహిళా కమిషన్ తప్పు పట్టింది. ఆయన చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని… మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్(AP Women Commission) పేర్కొంది. ఈ క్రమంలో… పవన్ కు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్(pawan kalyan)కు ఓ లేఖ రాశారు.
ఇటీవల మీరు మూడు పెళ్ళిళ్లు పై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారం రేపాయని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని ఇస్తూ మీరు మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్‌కు గురైందని వాసిరెడ్డి పద్మ తన లేఖలో పేర్కొన్నారు. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదురుచూసిందని వాసిరెడ్డి పద్మ తన లేఖలో పేర్కొన్నారు. ఇన్ని రోజులైనా మీ మాటలపై మీలో పశ్చాత్తాపం లేదని, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు మీ నుండి క్షమాపణలూ లేవని, ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్ళిళ్లు చేసుకోవలసి వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక అంశమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.
కోట్ల రూపాయలు భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. చేతనైతే మీరూ చేసుకోండని మీరు అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారు..? అని వాసిరెడ్డి పద్మ తన లేఖ ద్వారా పవన్‌ను ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూపోతే.. ఏ మహిళ జీవితానికి భద్రత ఉంటుంది..? అంటూ మరో ప్రశ్న సంధించారు. ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్ళిళ్లు పై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా..? అంటూ వాసిరెడ్డి పద్మ పవన్‌ను నిలదీశారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్ళిళ్లు చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా..? అంటూ ప్రశ్నించారు.
మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి స్టెఫినీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయమని వాసిరెడ్డి పద్మ తన లేఖద్వారా తెలిపారు. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారని, మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
మహిళలను కించపరిచే మాటలు మీరు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులో పేర్కొనడం గమనార్హం.