ఆంధ్రప్రదేశ్ లోని 9 శాసన మండలి సభ్యుల (AP MLC Elections) ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మూడు గ్రాడ్యుయేట్ (Graduate), రెండు ఉపాధ్యాయ (Teachers), నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గ (Local Bodies) స్థానాలకు ఈనెల 13న ఎన్నికలు (Poling) జరిగిన విషయం తెలిసిందే. గురువారం వెలువడుతున్న ఫలితాల (Results) ప్రకారం.. మూడు చోట్ల వైఎస్సార్ సీపీ (YSRCP) విజయం సాధించింది. శ్రీకాకుళం (Srikakulam) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించాడు. వైఎస్సార్ సీపీకి 636 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా అధికార పార్టీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంగకా రవీంద్రనాథ్ గెలుపొందారు. మొత్తం 1,105 ఓట్లు ఉండగా 1088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓట్లు వేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్ కు 481 మొదటి ప్రాధాన్యం ఓట్లు రాగా.. వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్ కు 120 ఓట్లు పడ్డాయి.
ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం ఉదయం 8 గంటలకు ప్రారంభించింది. ఫలితాలతో మొత్తం 139 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కాగా ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ సీపీ అన్ని బలాలను ప్రయోగించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ ప్రచారానికి వినియోగించుకుంది. భారీ ఎత్తున బోగస్ ఓట్లను వేయించుకుంది. పదో తరగతి కూడా ఉత్తీర్ణత కానీ వారితో పట్టభద్రుల ఓట్లు వేయించిన విషయం తెలిసిందే. అనంతపురములో ఒక మంత్రి ఏకంగా నగదు పంపిణీని ప్రోత్సహించారు. నగదు పంపిణీపై తన కార్యాలయంలో వివరాలు తెలుసుకోవడం వివాదం రేగింది. ఇలా అంగ బలం.. అర్థ బలం.. రాజకీయ బలం అన్ని ఉపయోగించి ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
శ్రీకాకుళం-విజయనగరం – విశాఖపట్టణం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురము-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురము-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొటీ చొప్పున స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నంలోపు పూర్తిగా వెలువడనున్నాయి. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత నిరుద్యోగుల్లో ఉండడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. మొదటి ప్రాధాన్యంలో ఫలితాలు స్పష్టంగా వచ్చే అవకాశం లేదు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు గురువారం రోజంతా లెక్కింపు జరుగనుంది. శుక్రవారం మధ్యాహ్నానికి ఫలితాలు వస్తాయని తెలుస్తున్నది.