అంతా భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమ, మంగళవారాల్లో జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్ జన్పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి స్వరాష్ట్రం ఏపీకి బయల్దేరుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే ఇదే క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉంది.
పర్యటనపై దుమారం
అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడంపై ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులు జగన్ ఢిల్లీ పర్యటనను తప్పుబట్టాయి. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డిని తప్పించడం కోసం జగన్ ఢిల్లీ వెళ్తున్నాడని ఆ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో విచారణకు కళ్లెం వేసేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టాడని చెబుతున్నారు. కేంద్ర పెద్దలను కలిసి విచారణ తాత్సారమయ్యేలా.. లాబీయింగ్ చేసేందుకు ఈ ఢిల్లీ టూర్ అని, దానికి గ్లోబల్ సమ్మిట్ అనే ముసుగు కప్పుతున్నారని ధ్వజమెత్తారు.