టాలీవుడ్ నటుడు పృథ్వీ ఏపీలోని వైసీపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నటుడు పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ కూడా అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన ఓ వీడియో టేప్ వైరల్ అయ్యింది. ఆ వీడియో కలకలం వల్ల ఆయన ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఘటన తర్వాత చాలా కాలంపాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఆ తర్వాత రాజకీయాల జోలికి వెళ్లని పృథ్వీ జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే నటుడు పృథ్వీ ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అయిన వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ వై నాట్ 175 అంటోందని, అయితే అన్ని స్థానాల్లో విజయం సాధించేట్టు ఉంటే 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలు కావడం ఖాయమన్నారు.
వైసీపీ ఓడిపోవడం ఖాయమని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలపోతుందని నటుడు పృథ్వీ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. టీడీపీ-జనసేన కూటమి 135 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో సుపరిపాలన ప్రారంభమవుతుందని, మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని నటుడు పృథ్వీ ఎద్దేవా చేశారు.