Hero Ajith: సరికొత్త బిజినెస్ ప్రారంభిస్తున్న అజిత్..!
హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయకున్నా, ఆయన సినిమాలన్నీ దాదాపు తెలుగులో డబ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఆయనకు ఇక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమాలు లేకపోతే తనకు నచ్చిన మోటార్ రైడింగ్, గన్ ఫైరింగ్ ట్రైనింగ్స్తో హీరో అజిత్ కాలం గడుపుతుంటారు. రీసెంట్ టైమ్‌లో ఆయన మోటార్ సైకిల్ మీద ఇండియా టూర్ వేశారు. ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు నేపాల్, భూటాన్ వంటి ప్రాంతాలను సైతం బైక్ మీద దర్శించారు. త్వరలోనే ఆయన బైక్‌పై వరల్డ్ టూర్ వెళ్లాలనుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో బైక్ మోటార్ సైకిల్ విహారయాత్ర బిజినెస్ స్టార్ట్ చేశారు అజిత్. బైక్‌పై లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి, అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వారి కోసమే ఈ కంపెనీని ఏర్పాటు చేశారాయన. ఈ కంపెనీ ద్వారా- బైక్ రైడ్స్, అడ్వెంచర్స్ టూర్స్ అంటే ఇష్టపడే వారికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ కంపెనీ ద్వారా దేశంలోని తరచూ బైక్ అడ్వెంచర్ టూర్లను నిర్వహిస్తామని అజిత్ కుమార్ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ప్రకృతి అందాలను వెలికి తీయగలుగుతామని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా- అంతర్జాతీయ రోడ్లపైనా రయ్యి మంటూ దూసుకెళ్లే అవకాశాన్ని బైక్ రైడర్స్‌కు కల్పిస్తామని ఈ ప్రకటనలో ఆయన వివరించారు. బైక్ రైడింగ్ పట్ల తనకు ఉన్న అభిరుచిని ప్రొఫెషన్‌గా మార్చుకున్నానని, తనలాగే బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారికోసం ఏకే మోటో రైడ్ ద్వారా బైక్ రైడర్స్, అడ్వెంచర్స్ ఎంథూసియాస్ట్స్‌లకు ఇదో చక్కని అవకాశాన్ని కల్పించదలచుకున్నట్లు అజిత్ కుమార్ చెప్పారు. వాస్తవ జీవితానికి, బైక్ రైడింగ్‌కు దగ్గరి సంబంధం ఉందని వ్యాఖ్యానించారు.
జీవితం కూడా ఓ అందమైన రైడ్ వంటిదేనని, బైక్ రైడింగ్ చేస్తోన్నప్పుడు ఎదురయ్యే అనుభవాల తరహాలోనే జీవితంలో ఎన్నో మలుపులు ఉంటాయని పేర్కొన్నారు. బైక్‌పై లాంగ్ డ్రైవ్, అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి తగిన భద్రత, సౌకర్యాలను కల్పించడంలో ఏకే మోటో రైడ్ నిబద్ధతతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. అలాంటివారికి అడ్వెంచర్ టూరింగ్ సూపర్‌బైక్‌లను అందిస్తామని చెప్పారు. బైక్ టూర్లో అనుభవం ఉన్న వారిని ప్రొఫెషనల్ గైడ్‌గా అపాయింట్ చేశామని, ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా అక్కడి సమగ్ర సమాచారాన్ని, స్థానిక ఆచార వ్యవహారాలు, సంస్కతి సంప్రదాయాల గురించి విస్తృతమైన పరిజ్ఞానం ఉన్న వారు గైడ్స్‌గా ఉంటారని అజిత్ కుమార్ అన్నారు. ఒక్కో అడ్వెంచర్ టూరిజానికి ఎంత ఛార్జీని తీసుకుంటారనేది ఇంకా వెల్లడి కాలేదు.