»Whatsapp Working On This Privacy Feature For Linked Devices
WhatsApp: కొత్త ఆప్షన్.. వాట్సాప్ లింక్డ్ డివైజ్లకూ రానున్న ఛాట్ లాక్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు లింక్డ్ డిజైజ్లకూ ఛాట్ లాక్ ఆప్షన్ని కొత్తగా తీసుకురానుంది.
WhatsApp New feature : ఇటీవల కాలంలో వాట్సాప్ చాలా మంది జీవితాల్లో భాగం అయిపోయింది. అంతగా వాడుకలోకి వచ్చిన ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లో వినియోగదారుల భద్రత కోసం ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉంటారు. అందులో భాగంగానే మన మొబైల్ వాట్సాప్‌లోకి గతంలోనే ఛాట్ లాక్ ఆప్షన్ని తీసుకొచ్చింది. ఫింగర్ ప్రింట్ యాక్సస్ని పెట్టుకోవడం ద్వారా మనకు కావాలనుకున్న ఛాట్స్‌ని ఇతరులు ఎవరూ చూడకుండా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ఫోన్లోనే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్ లింక్డ్ డివైజ్‌ల్లోనూ వాడుకోవడానికి వీలు కుదరనుందని సంస్థ చెబుతోంది. అంటే మనం మన వాట్సాప్‌ను కంప్యూటర్లో, ట్యాబ్లెట్లలో లింక్ చేసుకుని వాడుతూ ఉంటాం కదా. అక్కడ కూడా ఈ ఆప్షన్ త్వరలోఅనేబుల్ అవుతుంది.
ఈ కొత్త ఆప్షన్‌తో మన వాట్సాప్(WhatsApp) ఛాట్లు మరింత భద్రంగా మారనున్నాయి. అవసరం అయిన వారు ప్రైవసీ కోసం ఈ ఆప్షన్ని లింక్డ్ డివైజ్‌ల్లోనూ వాడుకోవడానికి వీలవుతుంది. దీనికి సంబంధించిన బీటా వెర్షన్‌ను వాట్సాప్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉంది. ఈ అప్డేట్కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది.
ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.24.4.14లో ఈ ఫీచర్ మొదట కనిపించిందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. దీన్ని ఇంకా ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తూ ఉన్నామని రానున్న అప్డేట్లలో(Updates) దీన్ని వినియోగదారులకు అందిస్తామని వెల్లడించింది.