BAPS temple opening : యూఏఈలో అతి పెద్ద హిందూ దేవాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్న మోదీ
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు అచ్చంగా అలాంటి సందడే విదేశమైన యూఏఈలో జరుగుతోంది. ఇవాళ అక్కడ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు.
BAPS temple opening ceremony : విదేశం యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో అతి పెద్ద హిందూ దేవాలయానికి నేడు ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈలోని అబుదాబికి చేరుకున్నారు. అక్కడ బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయన్ (BAPS) పేరుతో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి యూఏఈ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ 2015లో భూమిని ఇచ్చారు. ఆ తర్వాత 2019లో ఆలయ శంకుస్థాపన జరిగింది. అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో దీన్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి పాలరాయి, ఇసుకరాయిని తీసుకు వెళ్లారు. వాటిని ఆలయ నిర్మాణంలో వినియోగించారు.
యూఏఈ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 2015లో భూమిని కేటాయించారు. 2019లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు ఇది ఇప్పటికి పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. ఈ ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయం ఉట్టి పడేలా దేవతా విగ్రహాలు, సూర్య చంద్రులు, ఏనుగులు, నెమళ్లు, ఒంటెలు, సంగీత విద్వాంసులు తదితర అనేక శిల్పాలను ఆలయ గోడలపై చెక్కించారు. యూఏఈలోని 7 ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు.
ఆలయ ఫలకాలపై రామాయణం, భాగవతం, మహాభారతంతో పాటు శివ పురాణం లాంటి వాటినీ వర్ణించారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 3డీలో ఏక శిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు. ఇది అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు ఇక్కడ శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. దీని ఎత్తు 108 అడుగులు. ఇది భారత దేశం వెలుపల అతి పెద్ద హిందూ దేవాలయం.