Tata Motors: టాటా కారు కొందామనుకుంటే ఇదే సరైన సమయం.. భారీగా డిస్కౌంట్లు
కొత్త కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్న వారికి ఫిబ్రవరి నెలలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీలతో పాటు ఇప్పుడు టాటా మోటార్స్ కూడా ఆఫర్లను ప్రకటించింది.
Discounts on tata cars : ప్రముఖ కార్ల తయారీ కంపెనీలన్నీ దాదాపుగా ఫిబ్రవరిలో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఇదే బాటలో ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ కూడా పయనిస్తోంది. తమ ప్రముఖ కార్లు అన్నింటిపైనా దాదాపుగా ఆఫర్లు ప్రకటించింది. కాబట్టి ఎవరైనా టాటా కార్ని కొనాలనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయం అని గుర్తుంచుకోవాలి.
టాటా టియాగో (Tata Tiago) 2023 మోడల్స్ ధర రూ. 75,000 వరకు తగ్గింది. ఇందులో రూ. 60,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. అయితే టియాగో 2024 ఎడిషన్లపై రూ. 40,000 వరకు స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉంటాయి. టియాగో సీఎంజీ 2023 వేరియంట్లు రూ. 75,000, 2024 యూనిట్లు రూ. 25,000 వరకు తగ్గింపు ఆఫర్లలో లభిస్తాయి.
టాటా హారియర్ పైన కూడా సంస్థ మంచి ఆఫర్లను అందిస్తోంది. టాప్ స్పెక్ ADAS ఎక్విప్డ్ వేరియంట్‌పై రూ. 75,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. నాన్ ADAS వేరియంట్లపై మొత్తం రూ. 75,000 వరకు ఆఫర్లు, బెనిఫిట్స్‌తో సొంతం చేసుకోవచ్చు.
టాటా నెక్సాన్ (TATA Nexon) ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లపైనా సంస్థ డిస్కౌంట్లు ప్రకటించింది. నెక్సాన్ పెట్రోల్ ఎంటీ వేరియంట్లు రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తాయి. అయితే ఏఎంటీ వేరియంట్లు రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ఈ రెండు వేరియంట్లపై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉంది. వీటితో పాటుగా టాటా ఆల్ట్రోజ్, టిగోర్ లాంటి మోడళ్లపైన కూడా ఆఫర్లు ఉన్నాయి.