Hanmakonda : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, కండక్టర్ సహా మరో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో మేడారం వెళ్లే భక్తులు గంటన్నరపాటు ఇబ్బందులు పడ్డారు.