అవును నిజమే.. కేవలం 75 రూపాయలకే అవతార్ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ విజువల్ వండర్ని మరోసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరో మూడు నెలల్లో థియేటర్లోకి మరో కొత్త ప్రపంచం రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న అవతార్ సీక్వెల్ ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అంతకంటే ముందే అవతార్ సినిమా మరోసారి థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో చూసిన సినిమానే మళ్లీ అంత రేటు పెట్టి చూడాలంటే కాస్త కష్టమే. కానీ ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా బంపర్ ఆఫర్ రాబోతోందనే చెప్పొచ్చు.
ముందుగా సెప్టెంబర్ 16న’నేషనల్ సినిమా డే’ నిర్వహిస్తున్నట్టుగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ డేట్‌ని మరో వారం పొడిగించారు. ‘నేషనల్ సినిమా డే’ను సెప్టెంబర్ 23కు వాయిదా వేసినట్టుగా MAI వెల్లడించింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మల్టీప్లెక్స్ థియేటర్లలో.. ఏ సినిమా టికెట్ అయినా సరే 75 రూపాయలు మాత్రమే. ఇక అదే రోజు అవతార్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అవతార్ వచ్చి దాదాపు 13 ఏళ్లవుతోంది. దాంతో గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారి కోసం.. సెప్టెంబర్ 23న రీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క రోజు అవతార్ హై రెజల్యూషన్ సినిమాని.. తక్కువ టికెట్ రేటుతో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.