తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషన్ను ముట్టడించే ప్రయత్నం చేసిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఒంగోలులో ప్రైవేటు వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తుంటే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
Sanitation workers: ఏపీ(Andhra Pradesh)లోని పరిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) చేస్తున్న నిరసన నేడు ఉద్రిక్తంగా మారింది. గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంతో ఈ రోజు కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిచేశారు. లోపలికి రాకుండా కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్నారు. చెత్తవాహనాలు కార్యాలయం నుంచి బయటకు రాకుండా నిరసన వ్యక్తం చేశారు. కార్యలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులను కూడా గేటు బయటే అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కార్మికులను అరెస్ట్ చేశారు. దాంతో ఇతర కార్మికులు పోలీసు వాహనాలను అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాజంపేట మున్సిపల్ కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సీఐటీయూసీ నాయకుడు రవితోపాటు పలువురు కార్మికులను పోలీసులు వాహనం ఎక్కించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధమైన కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విజయనగరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.