ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే రోజున సాయంత్రం గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తుంటారు. ఇటీవల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య దూరం మరింత పెరిగింది. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కోర్టు తీర్పు తర్వాత రాజ్ భవన్‌లోనే పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. పరేడ్ నిర్వహించిన తర్వాత గవర్నర్ తమిళి సై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కేసీఆర్ సర్కార్‌తో గవర్నర్ తమిళి సై పడటం లేదు. అప్పట్లో పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో మొదలైన గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. అధికార కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్ యాదాద్రి వెళ్లిన సమయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీనిపై దుమారం చెలరేగింది. పలు సందర్భాల్లో కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ విమర్శలు చేశారు. తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణ గురించి తమిళి సై సౌందర రాజన్ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరు, రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టు ఆదేశాలు, తాజా పరిస్థితుల గురించి డిస్కష్ చేస్తారని తెలిసింది.