కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవితో పాటుగా మంత్రి పదవులపై కూడా నేతలు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఎవరిని సీఎంను చేస్తుందో, ఎవరికి ఏ పదవులను కట్టబెడుతుందోననే సందిగ్ధత నెలకొంది.
కాంగ్రెస్ సీఎం కుర్చీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. సీఎంగా ఎవరు ఉంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డిని సీఎం చేయాలని పార్టీ భావించినప్పటికీ కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి వంటివారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పోల్చితే తామేమీ తక్కువ కాదని వారు అధిష్ఠానాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సోమవారం హోటల్ ఎల్లాలో కూడా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి తప్పా ఇంకెవరైనా ఓకే
సీఎంగా రేవంత్ రెడ్డి తప్పా ఇంకెవరైనా పర్వాలేదని ఉత్తమ్, భట్టి, రాజనర్సింహా, రాజగోపాల్ రెడ్డి వంటివారు తేల్చి చెప్పినట్లుగా పార్టీల్లో చర్చలు సాగుతున్నాయి. రేవంత్‌కు పరిపాలన పరంగా అనుభవం లేదని, ఆయన ఎమ్మెల్యేగా చేశార తప్పా ప్రభుత్వంలో ఇంతవరకూ ఉండలేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపడంతో సీనియర్ నేతలంతా అలిగినట్లు తెలుస్తోంది. ఒక దశలో తాము సీఎల్పీ సమావేశానికి రాబోమంటూ భట్టి, ఉత్తమ్, రాజగోపాల్, దామోదర, శ్రీధర్ బాబు తేల్చి చెప్పినట్లుగా సమాచారం.
ఓటుకు నోటు కేసులో రేవంత్!
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నారని, అది పార్టీకి ఇబ్బందికరం అని పలువురు సీనియర్ నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా 3 గంటల కరెంట్‌తో పాటుగా ఇతర అంశాలపై అదుపు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆయనపై పలువురు సీనియర్ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాంటి వ్యక్తిని సీఎంను చేస్తే అది ప్రభుత్వానికి, పార్టీకి కూడా తీవ్ర నష్టం అని సీనియర్లు అధిష్ఠానం ముందు వాదించినట్లు తెలుస్తోంది.
వర్గాలుగా విడిపోయిన పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవితో పాటుగా మంత్రి పదవులపై కూడా పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయినట్లుగా కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పదవుల కోసం తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి డీకే మద్దతు ఇవ్వడంతో భట్టి, ఉత్తమ్‌తో పాటు ఇతర నేతలు ఖర్గేతో మంతనాలు సాగిస్తున్నట్లు వినిపిస్తోంది. కొందరు నేతలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు భట్టి, ఉత్తమ్ లకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఫైర్ అయినట్లు వినిపిస్తోంది. అయితే అధిష్ఠానం మాత్రం సీఎంగా ఎవరు సరైన వ్యక్తి అని తేల్చే పనిలో ఉంది.