»I Resigned From The Post Of Cm Lets Cooperate With The New Government Kcr
KCR: హుందాగా సీఎం పదవి నుంచి తప్పుకున్నా..కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్
తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత తొలిసారి పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష ఉంటుందని, పార్టీ శాసన సభా పక్ష నేతను కూడా ఎన్నుకుందామని తెలిపారు.
తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) ముగిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి సారి మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రవేఖరరావును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.
ఈ భేటీలో గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 జనవరి 16వ తేది వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల తీర్పు నేపథ్యంలో తాను హుందాగా తప్పుకున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను చూద్దామని, త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగే సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఉంటుందని, ఓటమికి గల కారణాలను సమీక్షిద్దామని కేసీఆర్ (KCR) తెలిపారు. త్వరలోనే పార్టీ శాసన సభా పక్ష నేతను కూడా ఎన్నుకుందామన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకుందామని, తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల న్యాయం జరగడం కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడుదామని మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.