»We Have Released The Water That Is Due To Ap Minister Ambati
APకి న్యాయంగా రావాల్సిన నీటినే విడుదల చేశాం: మంత్రి అంబటి
నాగార్జున సాగర్లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.
We Have Released The Water That Is Due To AP: Minister Ambati
Minister Ambati: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఏపీ అధికారులు తెరవడంపై అగ్గిరాజుకుంది. ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ, ఏపీ పోలీసుల మొహరించారు. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పత్రికల్లో జగన్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మీడియా ముందుకు వచ్చారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన నీటిని విడుదల చేశామని చెప్పారు. తమకు చెందిన 13 గేట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గతంలో చంద్రబాబు సర్కార్ (chandrababu) ఏపీకి చెందిన 13 గేట్లను, ఎన్ఎస్పీ కెనాల్, అక్కడ నీరు విడుదల చేసే తాళాన్ని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించిందని ఆరోపించారు. 2015లో అప్పటి ఏపీ సర్కార్ కూడా నీటి విడుదల కోసం ప్రయత్నించి విఫలమైందని గుర్తుచేశారు. ఆ సమయంలో గవర్నర్ వద్ద పంచాయితీ జరగగా.. తాళం తెలంగాణ వద్దే ఉండేందుకు అప్పటి సీఎం చంద్రబాబు (chandrababu) అంగీకరించారని పేర్కొన్నారు. అందుకు గల కారణం ఓటుకు నోటు కేసు అని ఉదహరించారు. కాదు కూడదంటే.. ఎక్కడ లోపల వేస్తారెమోనని భయపడి వెనక్కి తగ్గారని ఆరోపించారు.
ఆ రెండు జిల్లాలకు తాగునీరు
ఇప్పుడు సాగర్ వద్ద కుడి కాలువ నుంచి గుంటూరు (guntur), ప్రకాశం (prakasam) ఉమ్మడి జిల్లాలకు నీరు విడుదల చేశారని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఆ జిల్లాల్లో సాగు కోసం కాదు.. తాగునీటి కోసం ఇబ్బంది ఉందని.. అందుకే విడుదల చేశామని చెబుతున్నారు. మన భూభాగం, మన గేట్ల వద్ద తెలంగాణ పోలీసులు ఉండటం నేరం అని.. అందుకే స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేనిది.. ఇప్పుడు జగన్ సర్కార్ చేసిందని చెప్పారు. దానిని ఆ రెండు పత్రికలు దండయాత్ర అని రాసి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదని సూచించారు. ఓ తప్పును సరిదిద్దితే దండయాత్ర అవుతుందా అని అడిగారు. వారు చేయరు.. చేసిన వారిపై ఇలా అడ్డదిడ్డంగా రాస్తారని మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేదు
ఓ రాజకీయ పార్టీకి మేలు చేయడానికి సాగర్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చారని మాట్లాడటం సరికాదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు.. ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదు. ఓడించాల్సిన అవసరం అసలే లేదన్నారు. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన 66 శాతం నీటిని తీసుకుంటామని.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 34 శాతం నీటిని ముట్టమని స్పష్టంచేశారు. ఏపీకి కేటాయించిన టీఎంసీలు, క్యూసెక్కుల నీటిని మాత్రం తీసుకుంటామని తేల్చిచెప్పారు. శ్రీశైలంలో పవర్ స్టేషన్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా వాడుతోందని ఆరోపించారు.
టీడీపీ అభినందించలే
సాగర్ వద్ద తమ ప్రభుత్వం సాహసోపేత చర్యకు దిగితే ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికీ అభినందించ లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. కానీ పురందేశ్వరి మాత్రం మాట్లాడారు.. అనవసర వివాదం అంటారు. టీడీపీ అధ్యక్షురాలిగా మాట్లాడారెమో అని సెటైర్లు వేశారు. అందుకే టీడీపీ నుంచి చంద్రబాబు ఇతర నేతలు రియాక్ట్ కాలేదని అనుమానం వ్యక్తం చేశారు. పురందేశ్వరిని తమ అధ్యక్షురాలిగా భావిస్తున్నారెమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్నాళ్లూ లేనిదే.. ఇప్పుడే, తెలంగాణలో పోలింగ్ జరిగే సమయంలో ఎందుకు వెళ్లారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏదో ఒక రోజు వెళ్లం కదా.. సక్సెస్ అయ్యాం కదా అని చెప్పి కవర్ చేశారు మంత్రి అంబటి రాంబాబు.