»Release Of Water From Sagar Ap Sarkar Has Taken Control Of 13 Gates
NagarjunaSagar: సాగర్ నుంచి నీటి విడుదల.. 13 గేట్లను కంట్రోల్లోకి తీసుకున్న ఏపీ సర్కార్
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌పై నేటి ఉదయం నుంచి పెద్ద హైడ్రామా నడుస్తోంది. తమ భూభాగంలో ఉన్న సాగర్ లోని 13 గేట్లను స్వాధీనం చేసుకున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. మరోవైపు సాగర్‌పై ఏర్పాటు చేసిన బారికేడ్లను, ముళ్ల కంచెలను తొలగించాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ సాగర్ నీటిని ఏపీ ప్రభుత్వం విడుదల చేసి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఈ తరుణంలో సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నాగార్జున సాగర్ (NagarjunaSagar) నీటి విషయంలో మరోసారి ఏపీ, తెలంగాణ మధ్య వాగ్వాదం మొదలైంది. సాగర్ నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. డ్యామ్ నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు గేట్లను ఎత్తివేశారు. నాగార్జున సాగర్ 5వ గేటు నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని దిగువకు విడుదల చేశారు.
గురువారం తెల్లవారుజాము నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna sagar Project)పై ఊహించని హైడ్రామా నెలకొంది. రాత్రికి రాత్రి ప్రాజెక్టుపై పెద్దఎత్తున బలగాలను ఏపీ సర్కార్ మోహరించింది. ఆంధ్రా భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ గేట్లను తమ కంట్రోల్ లోకి తీసుకుంది. సాగర్‌లో మొత్తం 26 గేట్లు ఉండగా అందులో ఆంధ్రా భూభాగంలో ఉన్నటువంటి 13 గేట్లను తమ స్వాధీనంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది.
తెలంగాణ (Telangana)లో పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే సాగర్ ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ చర్యలను తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు బారికేడ్లు పెట్టారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని తొలగించాలని తెలంగాణ పోలీసులు (Telangana Police) కోరారు. 13 గేట్లు తమ పరిధిలోకి వస్తాయంటూ ఏపీ అధికారులు బారికేడ్లను తొలగించడానికి ఒప్పుకోలేదు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (Krishna River Management Board) ఆదేశాల ప్రకారంగా నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణ సర్కార్‌కు ఉంటుంది. నీటి విడుదల, భద్రతా విషయంలో కూడా ఇప్పటి వరకూ అదే జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ అధికారులు తమ పరిధిలోకి వచ్చే 13 గేట్లను (13 Gates) స్వాధీనం చేసుకుంటూ డ్యామ్ మధ్యలో ముళ్లకంచె వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.