అభిషేకం పాలతోనో, తేనేతోనో చేస్తారని అందరికీ తెలుసు. కానీ కారంతో అభిషేకం చేయడాన్ని చాలా మంది చూసుండరు. అయితే ఇక్కడొక స్వామికి మాత్రం భక్తులు ఏకంగా 60 కేజీల కారంతో పూజలు చేశారు.
ఓ స్వామిజీకి భక్తులు కారంతో అభిషేకం చేశారు. అభిషేకం అంటే ఏదో చిటికెడు కారం కాదు ఏకంగా 60 కేజీల కారంతో కారాభిషేకం చేయడం విశేషం. సాధారణంగా అభిషేకం అంటే ఆలయాల్లో పాలు, పంచామృతాలు, తేనె వంటి వాటితో చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం భక్తులు తమ ఇళ్ల నుంచి కవర్లలో కారం తెచ్చుకునిమరీ అభిషేకం చేశారు. కారంతో శరీరానికి నలుగు పెట్టినట్లుగా అభిషేకం చేయడంతో దానిని చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు తరలివచ్చారు.
ఈ కారాభిషేకం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివ దత్త ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో చోటుచేసుకుంది. ప్రత్యంగిరి దేవిని కొలిచేవారు శివస్వామికి ఎర్రని కారంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలో భాగంగా ముందుగా శివస్వామి ప్రత్యంగిరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యంగరా దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని చేపట్టారు. ఆ తర్వాత దేవి ఆవాహనలో ఉన్నటువంటి శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
అభిషేక కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారుగా 60 కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి దేవి ఉద్భవించిందనీ పురాణాల సారం సెలవిస్తోంది. ఆ ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టం అట. అందుకే ఆమె మెడలో ఎండు మిరపకాయలతో చేసిన హారాన్ని వేస్తారు.
అలాంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే జీవితంలోని బాధలు, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. అందుకే కార్తీకమాసంలో బహుళ తదియ రోజున కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం 29 సంవత్సరాలుగా హైదరాబాద్లో కూడా జరుగుతోంది. ప్రస్తుతం ద్వారకాతిరుమలలో రెండవ సంవత్సరం ఈ కారంతో అభిషేకం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.