»Kcr Made Sensational Comments Against The Congress Government And Indira Gandhi
KCR: ఇందిరమ్మ రాజ్యంలో 400 మందిని కాల్చి చంపారు
వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు పాత్ర ఎంతో కీలకం అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని లేదంటే రాష్ట్రం ఆగమైతదని సూచించారు.
KCR made sensational comments against the Congress government and Indira Gandhi
KCR: తెలంగాణ(Telangana) ఉద్యమంలో వరంగల్(Warangal) ఎంతో ముఖ్య భూమిక పోషించిందని, ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఇక్కడే జరిగిందని, భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి మొక్కు కూడా చెల్లించుకున్నమని తెలిపారు. తెలంగాణ చరిత్రకు ఓరుగల్లు సాక్షీభూతంగా నిలిచిందని, ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ.. వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చిందని, అందుకే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టామని వెల్లడించారు. ఇది కాకతీయులకు నిజమైన నివాళి అని తెలిపారు. వరంగల్ అనగానే అందరికిి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గుర్తుకు వస్తారని, ఉద్యమం మొదలు పెట్టినప్పుడు వారు తనను ఆశీర్వదించారని అన్నారు.
ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మీరు వేసే ఓటు రాష్ట్రాన్ని 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్(Congress) నాయకులు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని అంటున్నారు, కానీ అంత దరిద్ర రాజ్యం మరొకటి లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపారన్నారని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లలో వేశారని, అలాంటి పరిస్థితులు మనకు అవసరమా అని పేర్కొన్నారు.