అధికారం చేజిక్కించుకోవాలంటే యాత్ర చేపట్టాల్సిందేనని నేతలు విశ్వసిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంతో కదం తొక్కారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల కింద వైఎస్ఆర్ చేపట్టిన యాత్రకు ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. 2003 ఏప్రిల్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు 68 రోజుల పాటు జనంతో ఉన్నారు. రంగారెడ్డి చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1500 కిలోమీటర్ల వరకు కొనసాగింది. ప్రజల కష్ట నష్టాలను దగ్గరుండి చూశారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో చెప్పారు. అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవీని చేపట్టారు. 2009లో కూడా పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు. ఆరోగ్య శ్రీ, రుపాయికే కిలో బియ్యం, ఉపాధి హామీ పథకం లాంటి కీలక పథకాలు ప్రవేశపెట్టారు.
బాబు ‘వస్తున్నా మీ కోసం’
చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ‘వస్తున్నా మీకోసం’ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2012 అక్టోబర్ 2వ తేదీన హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. 13 జిల్లాల గుండా 2817 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 1253 గ్రామాలు, 162 మండలాల్లో గల 16 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను కలిసి కష్టనష్టాలను తెలుసుకున్నారు. 2013 ఏప్రిల్ 28వ తేదీన విశాఖపట్టణంలో గల అగనంపూడి వద్ద చంద్రబాబు పాదయాత్ర జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడుచుకుపెట్టుకుపోయింది. వైసీపీ విపక్షానికే పరిమితం కాగా.. తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది.
జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’
వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారు. వైఎస్ఆర్ మరణించారని తెలిసి గుండె ఆగి చనిపోయిన కుటుంబాలను పరామర్శించారు. 2017లో ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో నుంచి ప్రారంభమైన యాత్ర ఇచ్చాపురంలో ముగిసింది. 13 జిల్లాల గుండా 341 రోజులు పాదయాత్ర కొనసాగింది. 134 నియోజకవర్గాల్లో 2516 గ్రామాల గుండా యాత్ర సాగింది. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగా 2 కోట్ల మందిని కలిశారు. తమ ప్రభుత్వం ఏర్పడితే నవరత్నాలు అని హామీనిచ్చారు. పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. కావాలి జగన్, రావాలి జగన్ అని నినాదించగా.. జనం అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలు పాదయాత్ర చేపడుతున్నారు.