»Alert For Google Pay Users Warning Not To Use Screen Sharing Apps
Google Pay: ‘గూగుల్ పే’ వాడేవారికి అలర్ట్..స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దని హెచ్చరిక
గూగుల్ పే యాప్ వాడేవారికి ఆ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ పే నుంచి ట్రాన్సాక్షన్స్ చేసే టైంలో థర్టీ పార్టీ యాప్‌లు లేదా స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వినియోగించొద్దని హెచ్చరించింది.
డిజిటల్ పేమెంట్లలో యూపీఐ విప్లవాత్మక మార్పులను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పేమెంట్లలో అత్యధికంగా వినియోగించే యాప్స్ లల్లో గూగుల్ పే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు గూగుల్ పే కీలక సూచన చేసింది. గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఫోన్లో స్క్రీన్ షేరింగ్ చేసే యాప్ (Screen Sharign Apps)లను ఉపయోగించొద్దని హెచ్చరించింది. అలాంటి యాప్స్ ద్వారా సైబర్ నేరస్తులు నగదును దోచుకున్నట్లు తెలిపింది.
గూగుల్ పే యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారి వివరాలను, బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు గుర్తించి వారి ఖాతాల్లోని నగదును ఖాళీ చేసేస్తున్నారని, అందుకే యూజర్లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి గూగుల్ పే యాప్ ద్వారా జరిగే సైబర్ నేరాలను కట్టడి చేస్తున్నట్లు వెల్లడించింది. యాప్ ద్వారా పేమెంట్లు చేసిన తర్వాత వారి ఫోన్ ఉన్న స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను ఎవ్వరూ ఉపయోగించొద్దని గూగుల్ పే వెల్లడించింది.
సాధారణంగా రిమోట్ వర్కింగ్ కోసం లేదా ఫోన్, కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉంటే మరోచోటు నుంచి దాన్ని సరిచేసేందుకు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వినియోగిస్తుంటారు. అలాంటి వాటిలో ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటివి ఉన్నాయి. అయితే ఇటీవలె కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ షేరింగ్ యాప్‌లను వాడి బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నట్లు గూగుల్ పే నిర్వాహకులు తెలిపారు. స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వాడొద్దని తమ యూజర్లను హెచ్చరించింది.