»Download 150 Movies Per Second Fastest Internet Start In The World
Internet: సెకనుకు 150 సినిమాలు డౌన్లోడ్..ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ ప్రారంభం!
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా ప్రారంభించింది. ఈ నెట్వర్క్ సాయంతో కేవలం సెకనులోనే 150 సినిమాలను డౌన్లోడ్ చేయొచ్చు. సాంకేతిక రంగంలో ఇదొక సంచలనం అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా ప్రారంభించింది. ఆ ఇంటర్నెట్తో సెకనుకు 1.2 టెరాబైట్ డేటాను ప్రసారం చేయొచ్చు. అంత సామర్థ్యం గల టెక్నాలజీని చైనా ప్రారంభించడంతో సాంకేతిక రంగం మరో అడుగు ముందుకు వేసిందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. చైనా ఉత్పత్తి చేసిన ఆ ఇంటర్నెట్ నెట్వర్క్ ప్రస్తుతం ఉన్న ప్రధాన మార్గాల కంటే కూడా పది రెట్లు వేగంగా, ఎక్కువగా పనిచేస్తుందని చైనా వెల్లడించింది. ఈ ఇంటర్నెట్ సౌకర్యంతో సెకనుకు 150 సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ను సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి. ఈ నెట్వర్క్ మొత్తం 3,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉందని, దీనిని ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా అనుసంధానించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్వర్క్లు సెకనుకు కేవలం 100 గిగాబైట్ల వేగంతో పనిచేయగలవు. ఈమధ్యనే అమెరికా సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో 5జీ ఇంటర్నెట్ను ప్రవేశపెట్టి సంచలనం రేకెత్తించింది.
అయితే తాజాగా జాతీయ చైనా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్ (సెర్నెట్) అద్భుతాన్ని సాధించినట్లు తెలిపింది. ఇందు కోసం దశాబ్దం పాటు కృషి చేసినట్లు పేర్కొంది. జూలైలో ఈ ప్రాజెక్ట్ను యాక్టివ్ చేసి ఇప్పుడు అధికారికంగా ప్రారంభించినట్లు చైనా వెల్లడించింది. నెట్వర్క్ను నిజంగా ఎంతో వేగంగా వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్ట్ను రూపొందించినట్లు హువాయి టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఇంకా వేగవంతమైన నెట్వర్క్ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.