»Anantha Padmanabha Temple Another Miracle Another Crocodile Appears After A Year
Anantha Padmanabha Temple: మరో అద్భుతం.. ఏడాది తర్వాత మరో మొసలి ప్రత్యక్షం
అనంత పద్మనాభస్వామి ఆలయంలో మరో మొసలి ప్రత్యక్షమైంది. గత ఏడాది బబియా అనే మొసలి చనిపోయిన సంగతి తెలిసిందే. అది చనిపోయిన సరిగ్గా ఏడాదికి మరో మొసలి ప్రత్యక్షం అవ్వడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దేవాలయాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలోనే టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, విగ్రహాలు బయటపడ్డాయి. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. అలాగే స్వామి ఆలయం వద్ద ఉన్న సరస్సులో ఓ మొసలి ఉండేది. అది శాకాహారం మాత్రమే తింటుంది. గత కొన్నేళ్లుగా ఉన్న ఆ మొసలి గత ఏడాదే చనిపోయింది. సరిగ్గా ఏడాది తర్వాత ఆ ఆలయంలో మరో మొసలి ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఆలయం గురించి మరిన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనిక ఆలయంగా పేరు పొందింది. ఆలయంలోని నేల మాళిగల్లో బంగారం, వజ్రాలు, బంగారు విగ్రహాలను అధికారులు గుర్తించారు. ఈ గుడికి ఉన్న మరో విశిష్టతను అధికారులు గుర్తించారు. ఆలయ సరస్సులో బబియా అనే మొసలి ఉండేది. ఆ మొసలికి భక్తులు పండ్లు, ఫలాహారాలు ఇచ్చేవారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ మొసలి 2022 అక్టోబర్ 9వ తేదిన చనిపోయింది.
ఏడాది తర్వాత చనిపోయిన బబియా స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 8వ తేదిన సరస్సులో ఓ గుహలో మొసలి ఉన్నట్లుగా భక్తులు గుర్తించారు. ఆలయ ప్రధాన పూజారి పరిశీలించగా అది చిన్న మొసలి అని తెలుసుకున్నారు. ఇలా సరస్సులో మొసలి కనిపించడం మొదటిసారేమీ కాదు. దీనికంటే ముందుగా రెండు మొసళ్లు ఆ సరస్సులోనే ఏళ్ల తరబడి జీవించాయి. మొదటి మొసలిని బ్రిటీష్ వారు కాల్చి చంపేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకు మరో మొసలి ప్రత్యక్షం అయ్యింది.
అలాగే ఆ తర్వాత ఉన్న బబియా మొసలి చనిపోయిన తర్వాత కూడా అలాగే మరో మొసలి ప్రత్యక్షం అయ్యింది. అప్పట్లో బబియా మొసలి అంత్యక్రియలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, సామాన్యులు తరలి వచ్చి ఆ మొసలిని పూజించారు. బబియా చనిపోయిన తర్వాత దాని స్థానంలోకి ఇప్పుడు మరో చిన్న మొసలి చేరడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.