»Adjournment Of Anticipatory Bail Hearing In Sand Case No Arrest Till Then
Chandrababu: ఇసుక కేసులో ముందస్తు బెయిల్ విచారణ వాయిదా..అప్పటి వరకూ నో అరెస్ట్
ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ విచారణను నవంబర్ 22వ తేదికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ బాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీ అధికారులను ఆదేశించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక కుంభకోణం కేసులో ఏ2గా సీఐడీ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు ముందస్తు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే ఈ విచారణను నవంబర్ 22వ తేదికి హైకోర్టు వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో నేడు ఈ పిటిషన్‌పై విచారణ సాగింది. టీడీపీ పాలనలో ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిందని, ఇసుక విధానంలో దోపిడీ జరిగిందని సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
అయితే రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ ఇసుక కేసును నమోదు చేసినట్లుగా ముందస్తు బెయిల్ పిటిషన్లో చంద్రబాబు తెలియజేశారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ నెల 20వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక కేసు విచారణను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.1,300 కోట్ల మేర నష్టం వాటిళ్లిందని సీఐడీ ఆరోపణలు చేసింది. అలాగే ఈ ఇసుక పాలసీపై కేబినెట్లో చర్చలు సాగలేదని కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను సీఐడీ చేర్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసును నమోదు చేసినట్లు తెలిపింది.
చంద్రబాబు ప్రత్యేక మెమో ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని చేపట్టారని సీఐడీ ఆధారాలతో బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం లేకుండానే బాబు ఆ పనులు చేపట్టారని సీఐడీ తెలిపింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నవంబర్ 22వ తేదికి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ బాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.