»Police Attack On Soldier Atrocious Incident In Ap
AP : సైనికుడిపై పోలీసుల దాడి.. ఏపీలో దారుణ ఘటన
ఫోన్లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు(AP Police) దాడి చేశారు. ఈ ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది.
ఏపీ అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫోన్లో దిశ యాప్ (Disha app) ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు(AP Police) దాడి చేశారు. బాధిత సైనికుడు సయ్యద్ అలీముల్లాతో తన ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకోవడంతో అలీముల్లా అనుమానించాడు.సైబర్ మోసాల నేపథ్యంలో పోలీసులేనా అంటూ ప్రశ్నంచడమే అలీముల్లా చేసిన తప్పయ్యింది. తమనే ఐడీ కార్డు చూపించమంటావా అంటూ పోలీసులు (Police) అలీముల్లాను కాలర్ పట్టుకొని లాగేయడంతో అతడు కిందపడ్డాడు. వెంటనే ఓ కానిస్టేబుల్ బూటు కాలితో అతడిని తన్నాడు. అంతలోనే ఒక మహిళా కానిస్టేబుల్ దవడంపై కొట్టింది.
పోలీస్ స్టేషన్‌కు వస్తే అన్నీ చూపిస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు. సయ్యద్ అలీముల్లా(Syed Aleemullah)ను పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. కాగా.. బాధితుడు ఈ విషయాన్ని అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణకి ఫిర్యాదు చేశాడు. మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని వివరించాడు. సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైౖఫిల్ క్యాంపులో సైనికుడు (Soldier). సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చారు. ఎస్పీ మురళీకృష్ణను కలసి జరిగిన ఘటనను బాధితుడు వివరించారు. ఈ ఉదంతంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు కానిస్టేబుల్స్‌ను వీఆర్‌కు ఎటాచ్ చేశారు.