»Isro Chairman Halts Publication Of Controversy Over Biography
Somnath : బయోగ్రఫీపై వివాదం ప్రచురణను నిలిపివేసిన ఇస్రో చైర్మన్
ఇస్రో చైర్మన్ సోమనాథ్ బయోగ్రఫీ వివాదంలో చిక్కుకుంది. ఈ బయోగ్రఫీలో ఇస్రో మాజీ చైర్మన్ శివన్‌ను టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోబయోగ్రఫీ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ (Somnath) ఆటోబయోగ్రఫీ వివాదం రేపింది. వెన్నెలను తాగిన సింహాలు పేరుతో ఆయన బయోగ్రఫీ ప్రచురణ దశలో ఉంది. దానిలో తనకు పదోన్నతులు రాకుండా అడ్డుకున్నారని, చంద్రయాన్-2 (Chandrayaan-2) వైఫల్యం గురించి ప్రస్తావన ఉంది. దీనిపై వివాదం చెలరేగడంతో సోమనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తాను జీవితంలో ఎలా పురోగమించిందీ సోమనాథ్ ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. ఉద్యోగజీవితంలో తనకు ఎదురైన సవాళ్లను కూడా ఆయన పుస్తకంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇస్రో మాజీ చీఫ్ కే శివన్‌ను(K.Sivan) ఎస్.సోమనాథ్ తన పుస్తకంలో టార్గెట్ చేశారన్న ప్రచారం అకస్మాత్తుగా మొదలవడంతో ఆయన ఈ విషయమై తాజాగా స్పష్టతనిచ్చారు.
అయితే, చంద్రయాన్-2 (Chandrayaan-2 failure) వైఫల్యానికి సంబంధించి చేసిన ప్రకటనలో కొంత స్పష్టత లోపించిందని ఇస్రో చీఫ్ వ్యాఖ్యానించారు. కమ్యూనికేషన్ వైఫల్యం ఉందని, అది క్రాష్ ల్యాండ్ (Crash land) అవుతుందని స్పష్టంగా ప్రకటించలేదని వెల్లడించారు. ‘‘అసలేం జరిగిందో స్పష్టంగా చెప్పడమనేది నా దృష్టిలో మంచి పద్ధతి. ఇది సంస్థలో పారదర్శకత పెంచుతుంది. కాబట్టి, నేను ఈ అంశాన్ని పుస్తకంలో ప్రస్తావించాను’’ అని ఆయన పేర్కొన్నారు. తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చారు. సాధారణంగా స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ (ISRO Chairman) పదవి ఖాయమని ఓ అభిప్రాయం ఉందని, కానీ, మరో డైరెక్టర్‌ను నియమించడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని మాత్రమే తాను పుస్తకంలో పేర్కొన్నానని సోమనాథ్ స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి ఒక సంస్థలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వారి ప్రయాణంలో ఒకరకమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన అన్నారు.