తెలంగాణ ద్రోహులు అందరూ ఏకం అవుతున్నారని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని షర్మిల ప్రకటన చేయడంతో మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Jaggareddy will not win but will become CM: Harish Rao
Harish Rao: తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. ఆ వెంటనే మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు అంతా ఏకం అవుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్న వాళ్లందరూ ఇప్పుడు ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ గెలవాలంటే కేసీఆర్ వైపు నిలవాలని స్పష్టంచేశారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ టీ పీసీసీ చీఫ్ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆ కేసులో జైలుకు వెళ్లింది ఎవరని ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరని అడిగారు. చరిత్రను ఎవరూ మరవరని పేర్కొన్నారు. అలాంటి నేతలో మార్పు ఏముంటుందని.. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని తెలిపారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను కూడా అమ్మేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే కర్ణాటక ప్రజలు తప్పు చేశారని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కొట్లాట, కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ హయాంలో అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని గుర్తుచేశారు. తాగునీరు, కరెంట్ కొరత సమస్యలు లేవన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే గ్యాస్ సిలిండర్ ధర రూ.400కే ఇస్తామని హామీనిచ్చారు. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళకు రూ.3 వేలు ఇస్తామని చెబుతున్నారు.