ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను తిట్టడానికే అమర్ నాథ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయ్యారని తెలిపారు. ఆయన తిట్టడానికి తప్ప పరిశ్రమలు తీసుకురావడానికి పనికిరారని మండిపడ్డారు.
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా కొనసాగుతుంటే ఏపీకి ఒక్క రూపాయి రావట్లేదని అయ్యన్నపాత్రుడు సూచించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వద్దకు గుడివాడ అమర్ నాథ్ వెళ్లి నేర్చుకోవాలని హితవు పలికారు. ‘నా చరిత్ర ఏమిటో తెలుసా అని అమర్ నాథ్ అంటున్నాడని.. నాకు పెద్ద చరిత్ర ఉంది.. మరి మాకు లేదు?. దావోస్ పర్యటనకు అసలు ఆహ్వానం అందలేదా. ఆహ్వానం నిన్ననే వచ్చింది అని చెప్పాడు. ఆహ్వానమనేది అందరికీ ఒకేసారి అందిస్తారు. అది తెలియదా. అమర్ నాథ్ ఐటీ శాఖ మంత్రి అయ్యి 9 నెలలు దాటిపోయింది. ఐటీ మంత్రిగా ఒక్క పరిశ్రమ తెచ్చావా? 90 మందికి ఒక్క ఉద్యోగం ఇచ్చావా?. వెళ్లి తెలంగాణ మంత్రి కేటీఆర్ తో నేర్చుకో. నువ్వు ఐటీ మంత్రివి కావు. మాలాంటివాళ్లను తిట్టడానికి నియమితుడైన మంత్రి’ అంటూ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.