Anitha Vangalapudi: మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్‌తో ఏపీలో దుమారం కొనసాగుతోంది. ఆ వెంటనే రోజా బయటకు వచ్చి మీడియా ముందు ఏడ్చేశారు. ఇక ఆ తర్వాత ఖుష్బూ, నవనీత్ కౌర్, రాధిక, రమ్యకృష్ణ, మీనా తదితరులు బండారుపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Anitha Vangalapudi) స్పందించారు.
ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని అనిత మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్యను కామెంట్ చేసిన సమయంలో ఎందుకు స్పందించలేదని అడిగారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగిన సమయంలో సినీ ప్రముఖులు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. టీడీపీ, జనసేన నేతల కుటుంబ సభ్యులపై కూడా రోజా కామెంట్స్ చేశారని గుర్తుచేశారు.
మద్యపాన నిషేధంపై సీఎం జగన్ మాట తప్పారని అనిత విమర్శించారు. మద్యం ద్వారా పేదల నుంచి నాలుగేళ్లలో రూ.94 వేల కోట్ల దోచుకున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. జే బ్రాండ్స్ మద్యంలో నాణ్యత లోపించిందని మండిపడ్డారు. ఆ బ్రాండ్స్ వల్ల నాలుగున్నరేళ్లలో తాగిన వారి లివర్ చెడిపోయిందన్నారు. జనాలను రోగాల బారిన పడేస్తూ.. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికీ డాక్టర్ అంటున్నారని మండిపడ్డారు.