తెలంగాణ(Telangana)లో ఎన్నికల హడావుడి మొదలైనంది. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవనుందన్న నేపధ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఢిల్లీ (Delhi) పెద్దలను రంగంలోకి దించి.. తెలంగాణ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. ఇటీవలే ప్రధాని మోదీ ఒక్క రోజు గ్యాప్‌లో రెండు రోజుల తెలంగాణలో పర్యటించి.. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాగా.. ఈ సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఫక్తు ఎన్నికల ప్రసంగాన్ని చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ(Congress party).. ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలని కసరత్తు చేస్తోంది.
ఇప్పటికే పాదయాత్ర, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్.. త్వరలో బస్సు యాత్ర (Bus yatra) కు సిద్ధమవుతోంది. ఈ నెల 15 తర్వాత బస్సు యాత్ర ప్రారంభం కానుండగా.. జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఈ నెల 10న సాయంత్రం గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, బస్సు యాత్రపై చర్చించనున్నారు.బస్సు యాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. 15 నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఉత్తర తెలంగాణలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొననున్నారు. ఈ నెల 19, 20, 21వ తేదీల్లో మూడు రోజుల పాటు బస్సు యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.
రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) వచ్చే అవకాశముంది. దీంతో రాహుల్ బస్సు యాత్ర ద్వారా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. అలాగే సోనియాగాంధీ(Sonia Gandhi), ప్రియాక గాంధీ కూడా బస్సు యాత్రలో పాల్గొనేలా టీ కాంగ్రెస్ వర్గాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. లోక్‌పాల్ (Lokpal Survey) అనే సంస్థ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. సర్వే ఇచ్చిన జోష్‌తో కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంగా పని చేయబోతుంది.