తెలంగాణలో (Telangana) ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో ఎన్నికలకు నగారా మోగనుంది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం (EC) అధికారులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల సన్నద్దతమై రాష్ట్ర అధికారులతో సమీక్షించనున్నారు. 5వ తేదీ తర్వాత ఏ క్షణమైనా రావొచ్చని అంటున్నారు. 5వ తేదీ సాయంత్రం రాష్ట్ర పర్యటనకు వచ్చిన అధికారులు ఢిల్లీ (Delhi) వెళ్లిన తర్వాత సీఈసీకి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది.
దీంతో ఈసారి కూడా అక్టోబర్‌లో వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ (PMMODI) మూడు రోజుల వ్యవధిలోనే రెండు రోజులు తెలంగాణలో పర్యటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ (Congress) కూడా దాదాపు అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలకు సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు (Officers) అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను అందించాలని, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ చైర్ (wheelchair)లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలన్నారు. ఏఈఆర్ఓ/ఈఆర్ఓల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల వివరాలను కూడా ఈసీ అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆమె తెలిపారు.