Shiva Raj Kumar: ప్రెస్మీట్లో అవమానం.. సిద్ధార్థ్‌కి హీరో శివరాజ్ కుమార్ క్షమాపణలు..!
హీరో సిద్ధార్థ్‌కి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ క్షమాపణలు తెలిపాడు. రీసెంట్ గా విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ్ కి అవమానం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయన సమావేశాన్ని కొందరు అడ్డుకున్నారు.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో జరిగిన హీరో సిద్ధార్థ్ మీటింగ్‌ను అక్కడివారు అడ్డుకున్నారు. దీంతో చాలా అవమానంగా భావించిన సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సిద్ధార్థ్ కి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై శివరాజ్ కుమార్ స్పందించారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ తరపున ఆయన సిద్ధార్థ్‌కు క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ పలు సంఘాలు చేపట్టిన కర్ణాటక బంద్‌కు శివరాజ్‌కుమార్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు.
‘పరభాషా నటుడి ప్రెస్ మీట్‌ను ఎవరు ఆపారో తెలియదు కానీ.. అలా చేయడం తప్పు. కర్ణాటక ప్రజలు అందరినీ స్వాగతిస్తారు. సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. సమస్యను ఎదుర్కొని దానికి పరిష్కారం వెతకాలి. అంతేకానీ ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఏంటి? సిద్ధార్థ్ విషయంలో అలా జరగడంతో నేను చాలా బాధపడ్డాను. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున నేను సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను. ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది.. అని శివరాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నడిగులుగా తాము అన్ని భాషలను ప్రేమిస్తామని, అన్ని భాషల సినిమాలను ఆదరిస్తామని శివరాజ్‌కుమార్ అన్నారు. సిద్ధార్థ్‌కు జరిగినట్టుగా భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా తాము చూసుకుంటామన్నారు. పోట్లాడడానికో, ట్వీట్ చేయడానికో వచ్చినంత మాత్రాన వాళ్లకు కావేరీ మీద ప్రేమ ఉందని అర్థం చేసుకోవద్దని శివరాజ్‌కుమార్ ఆందోళనకారులకు సూచించారు. కావేరీ పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.