Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..మరో నాలుగు రోజులు వర్షాలే!
మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వల్ల ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, కడప, అనంతపురం జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. వర్షాల వల్ల వాహనాల రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో సహా 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert)ను జారీ చేస్తూ ప్రకటన చేసింది. సోమవారం, మంగళవారం రోజుల్లో తెలంగాణ (Telangana)లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.