తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు తమ ముఖ్యమంత్రి జగన్ ది అని పేర్కొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో గురువారం వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డితో కలిసి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వేమన పద్యాలు లాంటి స్వచ్ఛమైన మనసున్న మారాజు ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కంచు మోగినట్టుగా కేవలం జగనన్నని తిట్టడానికే సభలు పెడుతూ మొరుగుతూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు.