ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు పబ్లిక్ మీటింగ్‌లతో జనాలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వచ్చిన రజాకర్ సినిమా టీజర్.. రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
‘రజాకార్.. ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ అనే చిత్రాన్ని సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించగా.. యాటా సత్యానారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ‘రజాకార్’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత రజాకర్ మరింత కాంట్రవర్శీ క్రియేట్ చేస్తోంది. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్‌కు కాదు.. అనే పాయింట్‌తో రజాకర్ టీజర్ మొదలైంది.
హైదరాబాద్ నగరంపై నిజాం రజాకార్ల ఏవిధంగా పెత్తనం చెలాయించారో ఇందులో చూపించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమాలో చూపించబోతునట్లుగా అర్థమవుతోంది. దీంతో ఈ టీజర్ సమాజంలోని కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని.. ఈ సినిమా రిలీజ్‌ను ఆపడం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సీఎం, కేటీఆర్, బీఆర్ఎస్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన కేటీఆర్ ‘రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు, దివాళా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు.
తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతోపాటు.. తెలంగాణ పోలీసులతో కూడా మేము ఈ విషయాన్ని తీసుకుంటాం’ అని ట్వీట్ చేశాడు. దీంతో రజాకార్ టీజర్‌పై ఎంఐఎం, ముస్లిం మత పెద్దల కన్నా ముందే.. కేటీఆర్ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరి కోసం కేటీఆర్ రజాకార్ సినిమాను వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ సినిమా ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేటీఆర్ భయపడున్నారా? అనే కథనాలు స్టార్ట్ అయ్యాయి. మరి రజాకర్ సినిమా ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.