తెలంగాణ(Telangana)లో మత విద్వేషాలు సృష్టించాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రజాకార్ టీజర్ (Razakar Teaser) ను ఓ నెటిజన్ కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేశారు. బీజేపీ(BJP)కి చెందిన నాయకులు తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. తెలంగాణ విమోచనం నేపథ్యంలో జరిగిన ఘటనలు, రజాకార్ల దాష్టికాన్ని తెలియజేస్తూ రజాకార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవరం సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేశారు.
మరో వైపు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని కౌంటర్ ఇచ్చారు. ఈ టీజర్ లో రజాకార్లు తెలంగాణ ప్రజలకు చేసిన దారుణ ఘటనలను చూపించారు. ముఖ్యంగా హిందువులపై దాడులను హైలెట్ చేసింది. ఈ సినిమా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ (BRS) నేతలు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 కథా వస్తువుగా మారింది.ఆ రోజు జరిగిన విముక్తి పోరాటం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు నారాయణ అన్నారు. అయితే రజాకార్ టీజర్లో ముస్లిం(Muslims)లని పెద్ద నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై మత పెద్దలు, రాజకీయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని చరిత్రను వక్రీకరించి సినిమాను తీశారని, రాజకీయం కోసం ఇలా తప్పుడు సినిమాలు తీయోద్దంటూ హెచ్చరిస్తున్నారు.