»Congress Victory In Telangana Rahul Rained Assurances
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి..హామీల వర్షం కురిపించిన రాహుల్
హైదరాబాద్ లోని తుక్కుగూడలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డుల హామీలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ చేయూతనివ్వనుందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇచ్చారు.
తెలంగాణలోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్లు తెలిపారు. రైతులకు ఏడాదికి రూ.15000 ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సంతకం మహాలక్ష్మీ పథకంపై చేస్తానని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఈ మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ..రాష్ట్రంలో పింఛన్‌ను రూ.4000 చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు, రూ.10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా, టీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రైతు భరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, ఉద్యమకారులకు 250 గజాల స్థలం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్, కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును అందివ్వనున్నట్లు రాహుల్ తెలిపారు.
తమ ప్రభుత్వం రాష్ట్రంలో జెండా ఎగురవేస్తే ఆరు హామీలను అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరై ప్రజలకు గ్యారెంటీ హామీలనిచ్చారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకాన్ని ప్రకటించడంతో కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి సాగాలంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.