Pawan Kalyan: ఏపీలో గత నాలుగున్నర ఏళ్ల పాలనలో అరాచక పాలన కొనసాగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఈ రోజు కలిశారు. చంద్రబాబుతో తనకు కొన్ని విధానపర విభేదాలు ఉన్నాయని.. అయినప్పటికీ కలిసి పనిచేశాం అని తెలిపారు.
విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. చంద్రబాబు నాయుడు విజనరీ అని.. సైదాబాద్ లాంటి నగరాన్ని క్రియేట్ చేశారని తెలిపారు. చంద్రబాబు తాలుకూ అనుభవం, శక్తి, సామర్థ్యాలను ఏ రోజు విభేదించలేదని పేర్కొన్నారు. ఏ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రిగా సంబంధం ఉండదన్నారు. సంబంధిత వ్యక్తులను విచారించాలి.. తప్ప అప్పటి సీఎంను అరెస్ట్ చేయడం భావ్యం కాదన్నారు.
ఏ బ్యాంక్ ఉద్యోగి తప్పు చేస్తే.. చైర్మన్‌ను అరెస్ట్ చేస్తారా అని పవన్ కల్యాణ్ అడిగారు. జగన్ ఆర్థిక నేరగాడు.. అతను జైలుకు వెళ్లాడని, ప్రతిపక్ష నేతను జైలుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. జగన్‌పై ఈ రోజుకు కూడా ఈడీ కేసులు ఉన్నాయని.. విదేశాలు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని గుర్తుచేశారు. సీఎం జగన్ అవినీతి తిమింగళం అని.. ఆయన ఇతరులపై అవినీతి కేసులు మోపడం ఏంటీ అని పవన్ కళ్యాణ్ అడిగారు. లిక్కర్ పాలసీలో 1/3 వైసీపీ నేతల జేబుల్లోకి వెళుతుందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవడం లేదని.. డైరెక్ట్ క్యాష్ అడగడంలో ఆంతర్యం ఏంటీ అని మండిపడ్డారు. రోడ్లు వేయవు, బెదిరిస్తావు.. అని సీఎం జగన్‌పై పవన్ విరుచుకుపడ్డారు. భూ కబ్జాలు జరుగుతున్న ఒక్కరిపై కేసు ఫైల్ చేయడం లేదని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఒంటరిగా పోటీ చేస్తే దశాబ్ధాలుగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతోందని వివరించారు. వైసీపీకి ఆరు నెలల సమయం మాత్రమే ఉందన్నారు. తర్వాత కూడా ఇదే రిపీట్ అవుతోందని హెచ్చరించారు. అధికారులు, పోలీసులు కూడా ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదలిపెట్టబోమని తేల్చిచెప్పారు. మాజీ సీఎంను రిమాండ్‌లో కూర్చొబెట్టడానికి దానికి సమాధానం చెబుతామని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తోందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.