»Nipah Virus Outbreak In Kerala 77 People Are At High Risk Category
Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ..77 మందికి హైరిస్క్
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్(Nipah virus) కేసులు చాపకింద నీరులా క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. మరోవైపు కంటాక్ట్ లిస్ట్ కూడా పెరిగిందని, మరికొంత మంది హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని వైద్యాధికారులు ప్రకటించారు.
Nipah virus outbreak in Kerala 77 people are at high risk category
కేరళలో నిఫా వైరస్(Nipah virus) క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత చెందగా..తాజాగా రాష్ట్రంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం 706 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారని ప్రకటించారు. వారిలో 77 మంది హై రిస్క్(high risk) కేటగిరీలో ఉన్నారని వెల్లడించారు. దీంతోపాటు వారిలో 153 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారని స్పష్టం చేశారు. మరోవైపు ఇంకో 13 మంది వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్నారని, వారికి తలనొప్పి వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైరిస్క్ ఉన్న వ్యక్తులు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కేరళ(Kerala) ప్రభుత్వం అన్ని చర్యలను సమన్వయం చేసేందుకు 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్లోఉన్న వారికి నిత్యావసరాలను అందించడంలో సహాయపడేందుకు ప్రభుత్వం వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు కోజికోడ్ జిల్లాలోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల పరిధిలోని 58 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు.
అయితే ఈసారి కోజికోడ్‌లో వ్యాప్తి చెందగా, డబ్ల్యూహెచ్ఓ(WHO), ఐసిఎంఆర్(ICMR) అధ్యయనాల ప్రకారం కేరళ మొత్తం ఇలాంటి ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని మంత్రి వీణా జార్జ్ అన్నారు. ఈసారి కేరళలో కనుగొనబడిన నిఫా వైరస్ జాతి బంగ్లాదేశ్ వేరియంట్ అని పేర్కొన్నారు. ఇది అధిక మరణాల రేటు వ్యాప్తిని కలిగి ఉందన్నారు. ఈ జాతి మనిషి నుంచి మనిషికి సులభంగా వ్యాపిస్తుందన్నారు.