కేరళలో నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించడంతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వ్యాధి సంక్రమించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
కేరళ (Kerala) రాష్ట్రంలో నిపా వైరస్ (Nipah Virus) విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మృతిచెందడంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయ్యింది. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ (Health Alert)ను ప్రకటించి ప్రజలకు వైద్య పరీక్షలు చేపడుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు నిపా వైరస్ కేసుల గురించి, ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి సమీక్షిస్తున్నారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
వైరస్ (Nipah Virus) బారిన పడి చనిపోయిన వారిలో ఒకరి బంధువు కూడా ఇంటెన్సివ్ కేర్ (Intensiv Care) యూనిట్లో చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కేరళ రాష్ట్రంలోని 2018, 2021 సంవత్సరాల్లో కోజికోడ్ జిల్లాల్లో నిపా వైరస్ సంక్రమణ కారణంగా కొందరు చనిపోయారు. రాష్ట్రంలో నిపా వైరస్ మొదటికేసును 2018 మే 19వతేదీన కోజికోడ్ నగరంలో గుర్తించారు.
నిపా వైరస్ జంతువుల నుంచి ప్రజలకు సంక్రమిస్తుందని, ఇది జూనోటిక్ వ్యాధి అని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి కలుషితమైన ఆహారం తినడం ద్వారా సంక్రమిస్తుందని, ఇది సోకితే శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిపా వైరస్ పందుల ద్వారా కూడా వ్యాప్తిచెందుతుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.