తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో మరో సరికొత్త సీజన్ తో మన ముందుకు వచ్చేసింది. పలు రంగాల్లో ప్రముఖులైన కొందరిని ఒకే ఇంట్లో ఉంచి.. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసి… వారికి కొన్ని టాస్క్ లు ఇచ్చి ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. కాగా… ఈ షోని అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో…. విమర్శించేవారు కూడా అంతే ఉన్నారు. తాజాగా.. ఈ షో పై సీపీఐ నారాయణ తనదైన శైలిలో విమర్శలు కురిపించారు.
సమయాన్ని వృధా చేసే కార్యక్రమం బిగ్ బాస్ షో అంటూ ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ షోను మళ్లీ బూతుల స్వర్గంగా చేస్తారా..? అని ప్రశ్నించాడు. అసలు ఈ షోతో ఏం సందేశమిస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలని సూచించారు.
కాసులకు కక్కుర్తిపడే వారు ఉన్నంత కాలం ఇలాంటి షోలు వస్తూనే ఉంటాయని అన్నారు. కాగా, నారాయణ గతంలో కూడా బిగ్ బాస్ షోపై, హోస్ట్ నాగార్జునపై ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. వల్గర్ కంటెంట్‌కు నిలయంగా బిగ్ బాస్ మారిందని విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే, తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. 6వ సీజన్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు.
శక్తి యుక్తులు ఉన్న యువత సమాజం కోసం కృషి చేస్తూ.. సామాజిక న్యాయం కోసమో లేక సంపద ఉత్పత్తి కి ఉపయోగ పడకుండా వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేస్తారా ? బూతుల స్వర్గం ఉత్పత్తి చేస్తారా అంటూ నారాయణ ప్రశ్నించారు.
‘‘ప్రేక్షకులు అడగాలి మాకేమి సందేశమిస్తున్నారని? ఏమిస్తారు ? మాలాగా మొగుళ్ళు పెళ్ళాల్ని వదిలేశి, పెళ్ళాలు మొగుడ్ని వదిలేశి అచ్చోసిన ఆంబొతుల్లాగా జీవించండని సందేశమిస్తారేమో ? గుడ్లప్పగించి చూడండి. కాసులకు కక్కుర్తి పడే లజ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నఅంత కాలం, ద్రౌపది వస్త్రాబరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాకరంగా దిగమింగుదామా ? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని ఉరుకుదమా ? ’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.