సైడ్ డాన్సర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన వారిలో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ముందుంటాడు. సినీ పరిశ్రమల్లో ఆయన దర్శకుడు, నటుడు, నిర్మాతగా వరుస విజయాలను అందుకున్నారు. పేద వారి కోసం రాఘవ లారెన్స్ ఓ ట్రస్ట్‌ను నెలకొల్పాడు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. 60 మంది పిల్లలను పెంచటంతో పాటుగా వికలాంగులకు డాన్స్ నేర్పిస్తూ వస్తున్నారు. కరోనా టైంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గుండె ఆపరేషన్స్ చేయించారు.
తాజాగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ తన ట్రస్ట్‌కి ఎవరూ డబ్బులు పంపొద్దని, తన పిల్లల్ని తానే చూసుకుంటానని అన్నారు. తాను డాన్స్ మాస్టర్‌గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్‌ను మొదలు పెట్టానని, మొదట్లో తన ట్రస్ట్ కోసం విరాళాలు సేకరించానని, అప్పట్లో రెండేళ్లకు ఓ సినిమా చేస్తుండటం వల్ల డబ్బులు వక్కువగా వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు ఏడాదికే మూడు సినిమాలు చేస్తున్నానని, డబ్బులు బాగానే వస్తున్నాయని, అందుకే ఇతరుల విరాళాలు వద్దని తెలిపారు.
తాను పొగరుతో ఇతరుల విరాళాన్ని వద్దనడం లేదని, చాలా ప్రాంతాల్లో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు ఉన్నాయని, అలాంటి వారికి సాయం చేస్తే మరెందరికో సాయం చేసినట్లు అవుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడేవారికి సాయం చేయాలని, అంది ఎంతో ఆనందాన్నిస్తుందని రాఘవ లారెన్స్ అన్నారు.
‘చంద్రముఖి 2’ (Chandramukhi2) ఆడియో లాంచ్ ఈవెంట్లో లారెన్స్ ట్రస్ట్ కోసం లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఆ డబ్బుతో పాటు తను కూడా కొంత డబ్బు వేసుకుని ఓ స్థలం కొని అందులో సుభాస్కరన్ తల్లి పేరు మీద బిల్డింగ్ కడతానని లారెన్స్ తెలిపారు. తన స్టూడెంట్స్ ఆ బిల్డింగ్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారని లారెన్స్ ఆనందం వ్యక్తం చేశారు.