తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత తగిన గుణపాఠం నేర్చుకున్నామని, పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని చెప్పడం గమనార్హం. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీగా చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోడీకి పిలుపునిచ్చారు. భారత నాయకత్వం, ప్రధాని మోడీకి నా సందేశం ఏమిటంటే, ఇరుదేశాల మధ్య ఎంతోకాలంగా కొనసాగుతున్న కాశ్మీర్ తదితర వివాదాలపై నిజాయితీ, నిబద్దతతో చర్చలు జరుపుదామని విజ్ఞప్తి చేశారు.
శాంతియుతంగా జీవనం సాగిస్తూ ప్రగతి సాధించడమా లేదా ఒకరికొకరు తగవులాడుతూ సమయం, వనరులను వ్యర్థం చేసుకోవడమా అనేది మన చేతుల్లో ఉందన్నారు. భారత్తో మూడు యుద్ధాలు చేస్తే, చివరకు మిగిలింది పేదరికం, వేదన, నిరుద్యోగం అని ఆవేదన వ్యక్తం చేశారు. గుణపాఠం నేర్చుకున్నామని, భారత్తో శాంతిని కోరుకుంటే, తమ దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, దేవుడు యుద్ధానికి ఆదేశిస్తే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పేందుకు ఎవరూ మిగలరన్నారు.
షెహబాజ్ షరీఫ్ ఇంటర్వ్యూలో అలా మాట్లాడిన కాసేపటికే పాక్ పీఎంవో మరో ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 5, 2019లో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని, అప్పటి వరకు రెండు దేశాల మధ్య చర్చలు ఉండవని నాలుక మడతేయడం గమనార్హం. అప్పుడు భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.