ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పనీ, ఆ పార్టీ పని అయిపోయిందని ఆయన అన్నారు.
రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణుల పై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలు లో ఉంచారు. సోమవారం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… వైసీపీ ప్రభుత్వం కోడి కత్తి డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
జగన్రెడ్డి… తన కార్యకర్తలను జైళ్లలో పెట్టించారని, పండగ పూట తన కార్యకర్తల కోసం జైలుకు వచ్చానని చంద్రబాబు అన్నారు. జగన్ పని అయిపోయింది అంటూ హెచ్చరించారు. టీడీపీ శ్రేణులపై పోలీసులు అతి దారుణంగా కేసులు పెట్టారని, టీడీపీ కార్యకర్తల పట్ల పోలీసులు నీచాతి నీచంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందని, ఇది స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజమని అన్నారు.
పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని.. అందరూ సమానమేనని పేర్కొన్నారు. టీడీపీ ప్లెక్సీలను చించివేస్తుంటే పోలీసులు గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్లెక్సీలు ఎందుకు చించివేస్తున్నారని అడిగిన పాపానికి.. కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఖబడ్దార్ పోలీసులు జాగ్రత్త.. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
కాగా.. మంత్రి పెద్దిరెడ్డి పై సైతం చంద్రబాబు మండిపడ్డారు. పెద్దిరెడ్డి నీ అంతు చూసే వరకు నిద్రపోను అంటూ వార్ణింగ్ ఇచ్చిన చంద్రబాబు కోడి పందాలకు అనుమతి ఎలా ఇచ్చారు? కోడి కత్తి గుచ్చుకొని చనిపోయిన వారి గురించి ఏమి సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పని అయిపోయింది, అ పార్టీ మూసుకొని వెళ్లే సమయం వచ్చిందని చంద్రబాబు సీరియస్ అయ్యారు.