TSRTC : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..టి9-30 టికెట్
ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్న టీఎస్ ఆర్టీసీ తాజాగా 'టి9-30 టికెట్' పేరుతో మరో రాయితీ పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వారి కోసం టీ-9(30) టికెట్ తీసుకొచ్చింది. రూ.50కే 30 కిలోమీటర్ల పరిధిలో రోజులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించేలా పాస్ అందజేయనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీనిని ప్రారంభించనుంది. రూ.20 అదనంగా చెల్లిస్తే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో(Express bus) ప్రయాణించే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వల్ప దూరం ప్రయాణించే వారి కోసం పల్లె వెలుగు బస్సుల్లో కొత్తగా ‘టి9-30 టికెట్’ను ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ఛైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (MD VC Sajjanar) తెలిపారు.
బుధవారం సంస్థ అధికారులతో కలిసి టీ9-30 టికెట్ (T9-30 ticket) పోస్టర్‌ను ఆవిష్కరించారు.30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకూ ఈ టికెట్ వర్తిస్తుందని, ఈ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుందన్నారు. ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టి9-60 టికెట్‌ను పల్లెవెలుగు బస్సుల్లో(Pallevelugu Bus) ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్‌ను గురువారం నుండి పురుషులకూ వర్తింపచేస్తామన్నారు.