మహారాష్ట్రం(Maharashtra)లో ఘోరం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఒకే గ్రామంలో 13 మంది మృతిచెందిన విషాద ఘటన రాయ్ గఢ్ జిల్లాలో జరిగింది. బుధవారం అర్ధరాత్రి రాయ్ గఢ్ జిల్లా(Raigarh District)లోని ఖలాపుర్ సమీపంలో ఉన్న ఇర్సల్ వాడి కొండ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షం కురవగా ఇర్సల్ వాడి కొండపై ఉన్న గ్రామంలోని 48 ఇళ్లపై ఒక్కసారిగా మట్టిపెళ్లలు, కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 ఇళ్లు నేలమట్టమవ్వగా.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
50 కుటుంబాలకు చెందిన 225 మంది నివసిస్తున్న ఇర్సల్ వాడి గ్రామంలో.. దాదాపు 100 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. బుధవారం సాయంత్రం నాటికి శిథిలాల కింది నుంచి 75 మందిని రక్షించారు. వాహనాల ద్వారా గ్రామంలోకి వెళ్లే దారి లేకపోవడంతో.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ (NDRF Team) నడకదారిలోనే ఘటనా ప్రాంతానికి చేరుకుంది. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.ఈ ప్రమాదంలో శిథిలాల కింద సుమారు 100 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను గుర్తించగా.. 22 మందిని శిథిలాల నుంచి రక్షించారు. పోలీసులు వాహనాల ద్వారా గ్రామంలోకి వెళ్లే దారి లేక నడకదారిలోనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు భారత వాతావరణ శాఖ రాయ్ గఢ్, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాయ్ గఢ్, రత్నగిరి, కొల్హాపూర్ (Kolhapur), సాంగ్లీ, నాగ్ పూర్, థానే జిల్లాలకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది.