ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 19 కొత్త SUVలను కొనుగోలు చేసింది. 19 టయోటా ఫార్యునర్ వెహికిల్స్‌లో నాలుగు బుల్లెట్ ప్రూఫ్, మరో రెండు వాహనాలు వీఐపీ సెక్యూరిటీలో భాగంగా జామర్స్ కలిగి ఉంటాయి. ఓ వైపు రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్త కాన్వాయ్ అది కూడా ఏకంగా 19 SUVలు కొనుగోలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ 2019లో అధికారంలోకి రాగానే ఏడు వాహనాలతో కొత్త కాన్వాయ్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వాహనాలు ఫిట్ కండిషన్లోనే ఉన్నాయి. కానీ కొత్త వాహనాలు ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికీ ఓ కారణం ఉంది.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ జనవరి 26వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాలను చుడుతున్నారు. పార్టీ కేడర్ కూడా తమ తమ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తన వారాహి ప్రచార రథం ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. త్వరలో వారాహి ద్వారా ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో జగన్ కొత్త కాన్వాయ్ కొనుగోలు ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు జోరుగా ప్రచారానికి సిద్ధమైన సమయంలో, మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేస్తున్న అధికార పార్టీ… ముఖ్యమంత్రి ఈజీ పర్యటనల కోసం ఈ కాన్వాయ్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో అధికారికంగా కాకపోయినా, అనధికారికంగా తాము అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని జగన్ ప్రజల్లోకి తీసుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ పాలన సాగించవచ్చు. అయితే అనధికారికంగా మాత్రమే. విశాఖ నుండి మార్చి లేదా ఏప్రిల్ నుండి పాలన సాగిస్తారు. అదే సమయంలో ఆ తర్వాత కర్నూలు నుండి కూడా పాలన చేయవచ్చు. అధికారికం కాదు కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇబ్బంది లేదు. అదే సమయంలో ఎన్నికలకు ముందు తాము చెప్పిన మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పకనే చెప్పినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది.
ఇప్పటికే అమరావతి నుండి పని చేస్తున్న జగన్, పోర్ట్ సిటీ విశాఖ నుండి పాలన చేయనున్నారని, ఇందుకోసమే కొత్త SUVలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. జగన్ విశాఖ నుండి పని చేయనున్నందున కొత్త కాన్వాయ్ అవసరమని, అందుకే వీటిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్, జామర్ ఉంటాయి. మూడు రాజధానులు… ఆయా ప్రాంతాల నుండి పరిపాలన కోసమే నాలుగు బుల్లెట్ ప్రూఫ్, రెండు జామర్లు ఉన్నాయని చెబుతున్నారు. కొత్త కాన్వాయ్ రెండుగా విభజిస్తారు. అలాగే, ఎక్కడికి అక్కడ కాన్వాయ్ సిద్ధంగా ఉంటే, ఇటు పరిపాలనకు, అటు ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు ధీటుగా ప్రచారానికి కూడా సులభమవుతుంది.