ఓ తల్లి తన కడుపున పుట్టిన బిడ్డల్ని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది. మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చే ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంతో ఉన్నట్లు, అలాగే ప్రసవం జరిగినట్లుగా ఆస్పత్రుల్లో రికార్డు నమోదైంది. అయితే తనకు జన్మించిన పిల్లల వివరాలు మాత్రం ఏ రికార్డుల్లోనూ కనిపించలేదు. దీంతో ఆ నగర అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఆ సమయంలోనే ఆ మహిళ చేసిన దారుణ విషయాలు వెలుగుచూశాయి.
మొదట్లో ఆమెకు పుట్టిన పిల్లల గురించి విచారించేందుకు పోలీసులు నిర్ణయించుకున్నారు. కోర్టును కూడా అనుమతి కోరారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఇంటికి విచారణ కోసం వెళ్లారు. అయితే ఆమె పోలీసులకు సహకరించలేదు. దీంతో పోలీసులు సెర్చ్ వారెంట్‌తో ఆ ఇంటికి మరోసారి వెళ్లారు.
ఇంట్లో పోలీసులు సెర్చ్ చేస్తుండగా ఫ్రిడ్జ్ లో రెండు పసిపిల్లల మృతదేహాలు కనిపించాయి. ఆ నవజాత శిశువులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ పిల్లల్ని తనే చంపినట్లుగా ఆ తల్లి ఒప్పుకుంది. అప్పటికే తనకు 12, 10, 8 ఏళ్ల పిల్లలు ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల వల్ల తనకు పుట్టిన పిల్లల్ని చంపినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పేదరికంలో ఉంటే బిడ్డల్ని కనడం ఎందుకని పోలీసుల ప్రశ్నించారు. దానికి ఆమె వద్ద సమాధానం మాత్రం లేదు. సువాన్ నగరానికి చెందిన ఆమెను జూన్ 23న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.