»Assam Asdma Report Floods In State 1 2 Lakh People Affected 800 Villages Submerged
Assam Flood: అస్సాంలో వరద.. నీట మునిగిన 800 గ్రామాలు.. నిరాశ్రయులైన 1.2 లక్షల మంది
అస్సాంలో తీవ్ర వరదల కారణంగా సుమారు 800 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వంతెనలు, నెట్వర్క్ టవర్లు పాడైపోయాయి.
Assam Flood: అస్సాంలో వరదలు విధ్వంసం సృష్టించాయి. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, గ్రామాలు నీట మునిగాయి. బుధవారం వరదల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటి వరకు 1.2 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు. దాదాపు 10 జిల్లాలకు వరద నీరు చేరింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం, బక్సా, బార్పేట, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రీ, కోక్రాఝర్, లఖింపూర్, నల్బరీ, సోనిత్పూర్, ఉదల్‌గిరి జిల్లాల పరిధిలోకి వచ్చే వరదల వల్ల 1 లక్షల 19 వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
రాష్ట్రంలోని నల్బారి జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది, ఇక్కడ సుమారు 45000 వేల మంది వరదల బారిన పడ్డారు. బక్సాలో 26000 మంది, లఖింపూర్‌లో 25000 మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారు. మంగళవారం వరకు దాదాపు 34 వేల మంది మాత్రమే దీని బారిన పడగా.. బుధవారం పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వరద బాధితులకు ఆశ్రయం కల్పించిన 5 జిల్లాల్లో 14 సహాయ శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ మొత్తం 2091 మందికి ఆశ్రయం కల్పించారు. ఇది కాకుండా 5 జిల్లాల్లో 17 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు నడుస్తున్నాయి.
780 గ్రామాల్లో నీరు
NDRF, SDRF, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, NGOలు, స్థానిక ప్రజలు అస్సాంలో సహాయ చర్యల కోసం పగలు, రాత్రి నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1280 మందిని రక్షించారు. ASDMA ప్రకారం, ప్రస్తుతం 780 గ్రామాలు నీటిలో ఉన్నాయి. సుమారు 10,000 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోయింది. బ్రహ్మపుత్ర ఉపనదులు బెకి రోడ్ బ్రిడ్జి, పగ్లాదియా ఎన్‌టి రోడ్, పుతిమరి ఎన్‌హెచ్ రోడ్డుపై ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని ఎఎస్‌డిఎంఎ తెలిపింది.
IMD ఆరెంజ్ అలర్ట్ జారీ
భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరింత ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ అంచనా వేసింది. “రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతం నుండి ఈశాన్య భారతదేశం మీదుగా అల్పస్థాయి దక్షిణ/నైరుతి గాలుల కారణంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ గాలుల కారణంగా రానున్న రెండు రోజుల పాటు ఈశాన్య ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD యొక్క స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది.