కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న వాహనికి ప్రమాదం జరిగింది. కారు ఇడుక్కి జిల్లాలోని కుమలి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో చిన్నారి సహా మొత్తం 10 మంది ఉన్నారు.తమిళనాడులోని తేని జిల్లా అండిపెట్టి నుంచి పది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లారు.
దర్శనం అనంతరం శుక్రవారం మళ్లీ స్వగ్రామానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడు సరిహద్దులోని లోయర్ క్యాంప్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో.. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.కుమలి-కంబం రహదారిపై వారి వాహనం అదుపు తప్పి.. లోయకి వెళ్లింది. ముళ్లిపెరియార్ డ్యామ్ నుంచి తమిళనాడుకు నీటిని తరలించే పైపులపై ఆ కారు పడిపోయింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. స్పాట్లో నలుగురు చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో కన్నుమూశారు.